ఏపీ, తెలంగాణల్లో ఏటీఎంలు ఖాళీ కావడానికి ఇవీ కారణాలు! - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ, తెలంగాణల్లో ఏటీఎంలు ఖాళీ కావడానికి ఇవీ కారణాలు!

March 30, 2018

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఏటీఎంలు ఎండమావులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన నో క్యాష్ బోర్డులే సాక్షాత్కరిస్తున్నాయి . బోర్డులు కట్టని ఏటీఎంలలోనూ అదే సమస్య. రెండు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో 50 శాతంకంటే తక్కువ ఏటీఎంలలోనే డబ్బు ఉందని, అది కూడా అరకొరే అనే స్వయంగా  బ్యాంకులే సెలవిస్తున్నాయి. ఈ సమస్య ఎందుకు తలెత్తింది? ఆర్బీఐ ఒక పక్క ట్రక్కులకు ట్రక్కుల నోట్లను తెలుగు రాష్ట్రాలకు పంపుతోంటే ఈ సమస్యకు ఎందుకొచ్చింది?

హామీ లేదన్నా ప్రచారం..

ప్రభుత్వం ప్రతిపాదించిన ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లులోని బెయిల్ ఇన్ క్లాజుపై జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్లాజు కింద బ్యాంకుల్లో దాచుకునే డబ్బుకు గ్యారంటీ ఉండదని ప్రచారం జరుగుతోంది. బ్యాంకులు దివాలా తీస్తే అవి ఖాతాదారులకు సొమ్మును చెల్లించనక్కర్లేకుండా ఈ బిల్లు వీలు కల్పిస్తుందంటున్నారు. అయితే ప్రభుత్వ బ్యాంకుల విషయంలో అలా జరగదని ప్రభుత్వం చెబుతోంది. బెయిల్ ఇన్ క్లాజ్ చివరి అస్త్రమేనని, సామాన్యులు డబ్బుకు ఢోకా ఉండదని అంటోంది. అయితే ఈ అర్థం కాని, అర్థంపర్థం లేని ఆర్థికాంశాలు ప్రజలకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకొచ్చిన గొడవ, మన డబ్బులు మనం తీసుకుంటే సరిపోతుంది కదా అని డబ్బులు డ్రా చేసుకుంటున్నారు.

మరోపక్క.. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, ఐసీఐసీఐ, యూబీఐ తదితర బ్యాంకుల్లో కుంభకోణాలు వెలుగుచూడ్డంతో డబ్బులను బ్యాంకుల్లో ఉంచితే మంచింది కాదని సామాన్యులు భావిస్తున్నారు. ఇదివరకు ఉద్యోగులు ప్రతినెలా తొలివారం 5 నుంచి 10వేల వరకు డ్రా చేసుకునేవారని, ఇప్పుడు నూటికి 90 మంది 15 నుంచి 20 వేల వరకు డ్రా చేస్తున్నారని, కొందరైతే తమకు పడిన జీతం మొత్తాన్ని అలా పడిందో లేదో ఇలా తీసేసుకుంటున్నారని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల కోసం పెద్దనోట్లను దాచుకుంటున్నారు..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది. రాజకీయ నాయకులు జనానికి పంచేందుకు, ఇతరత్రా ఖర్చులకు పెద్ద నోట్లను గుట్టలుగుట్టలుగా పేర్చుకుంటున్నారు. బినామీల ఖాతాల్లోంచి కోట్లాది డబ్బులను డ్రా చేయించి రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఎన్నికల వరకు డబ్బు కోసం వేచి ఉండలేమని, ఆ లోపల నోట్ల రద్దు వంటి తీవ్ర నిర్ణయాలేమైనా తీసుకుంటే ఇబ్బంది వస్తుందని వారు భావిస్తున్నారు. కొందరు డ్రా చేసిన డబ్బును స్థిరాస్తి వ్యాపారాల్లో పెడుతున్నారు.

మరింతమంది బినామీల ఖాతాల్లో వేస్తున్నారు.  కొందరు బంగారం కొంటున్నారు. ఎలావీలుపడితే అలా చేతిలో బ్యాంకులో కాకుండా చేతిలో రొక్కం, అదికూడా వెంటనే నగదులోకి మార్చుకునే వీలుండే సదుపాయాలను చూసుకుంటున్నారు. దీంతో ఏటీఎంలలో, బ్యాంకుల్లో డబ్బులు దొరడకండం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని హైదరాబాద్ లోని ఓ ప్రముఖ బ్యాంకు అధికారి తెలిపారు.