రేషన్ బియ్యానికి బదులుగా నగదు ఇవ్వాలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. లబ్దిదారుల కోరిక మేరకు బియ్యం వద్దంటే ఆ మేరకు ప్రతీనెలా నగదును వాలంటీర్ల ద్వారా అందించాలని నిర్ణయించింది. ముందుగా ప్రయోగాత్మకంగా తొలి దశలో అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలలో అమలు చేయాలని నిర్ణయించారు. నగదువైపు మొగ్గు చూపే లబ్దిదారుల వద్ద ఈ నెల 18 నుంచి 22 వరకు వారి నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటారు. 23న వీఆర్వో పరిశీలన అనంతరం 25న తహసీల్దార్ ఆమోదం తీసుకుంటారు. కిలో బియ్యానికి రూ. 12 నుంచి 15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు నగదు తీసుకొని భవిష్యత్తులో బియ్యం కావాలనుకుంటే బియ్యం ఇస్తారు. నగదు బదిలీ మొదట వాలంటీర్ల ద్వారా ఆ తర్వాత నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నారు.