పట్టపగలే బ్యాంకులో దొంగల బీభత్సం.. క్యాషియర్ను కాల్చి... - MicTv.in - Telugu News
mictv telugu

పట్టపగలే బ్యాంకులో దొంగల బీభత్సం.. క్యాషియర్ను కాల్చి…

October 13, 2018

అప్పుడంటే దొంగలు రాత్రిపూట వచ్చి దోచుకెళ్ళేవారు. కానీ ఇప్పుడు దొంగలు పట్టపగలు కూడా వచ్చి దోపిడీలకు పాల్పడుతున్నారు. అడ్డొచ్చినవారిని అంతమొందిస్తున్నారు. తాజాగా ఓ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. పట్టపగలు దుండగులు బ్యాంకులోకి అక్రమంగా చొరబడి తుపాకులతో బెదిరించి అందినకాడికి దోచుకెళ్ళారు. అడ్డొచ్చిన బ్యాంక్ మేనేజరును తుపాకితో కాల్చి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే…

ఢిల్లీలోని చావ్లా సమీపంలోని కైరా గ్రామ కార్పోరేషన్‌ బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది ఈ ఘటన. అప్పటివరకు బ్యాంకులో ఎవరి పనుల్లో వారున్నారు. నలుగురైదుగురు వినియోగదారులు బ్యాంకులో వున్నారు. ఆ సమయంలో బ్యాంకు ఉద్యోగులు ఆరుగురు వున్నారు. ఇంతలో ఆరుగురు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి బ్యాంకులోకి చొరబడ్డారు. అడ్డొచ్చిన సెక్యూరిటీని కొట్టారు. వినియోగదారులను బెదిరించి మూలన కూర్చోమని గదమాయించారు.

వెంటనే క్యాషియర్ డ్రా నుంచి రూ. 2 లక్షలు తీసుకున్నారు. అప్పుడు క్యాషియర్ సంతోష్ కుమారు(45) ప్రతిఘటించడంతో అతణ్ణి తుపాకీతో కాల్చి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకునేలోపే అగంతకులు తప్పించుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న సంతోష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించామని కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

మృతుడు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ రిటైర్డ్‌ ఉద్యోగని పోలీసులు తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత సంతోష్‌, కార్పోరేషన్‌ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సంతోష్‌కు ఓ భార్య ఇద్దరు పిల్లలున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.