కులహత్యపై తమిళంలో సినిమా - MicTv.in - Telugu News
mictv telugu

కులహత్యపై తమిళంలో సినిమా

December 16, 2017

సమాజంలో ఎన్నోమార్పులు వస్తున్నా కులమత విభేదాలు మాత్రం పోవడం లేదు. దాడులకు, హత్యలకు పురిగొల్పుతున్నాయి. సమాజాన్ని చైతన్యపరచాల్సిన కళారూపాలు కూడా కేవలం వినోదానికి, పచ్చిబూతులకు పరిమితమై మనం నాగరిక సమాజంలోనే ఉన్నామా అనే అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే కొందరు కులమతాల వివక్షపై అలుపెరగని  పోరు సాగిస్తూనే ఉన్నారు.

గత ఏడాది తమిళనాడులో సంచలనం సృష్టించిన కులహత్య ఉదంతం ఆధారంగా తమిళంలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ‘మారద సమూగం’ (మారని సమాజం) పేరుతో దీన్ని తీస్తున్నారు.

ఉడుమాలపేటలో 2016 మార్చిలో శంకర్ అనే దళిత యువకుడిని దేవర్ వర్గం వారు హత్య చేశారు. అతడు దేవర్ వర్గానికి చెందిన కౌసల్య అనే యువతి ప్రేమించి పెళ్లాడినందుకు ఈ దారుణానికి తెగబడ్డారు. కౌసల్యను కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసులో కౌసల్య తండ్రి సహా ఆరుగురికి మరణశిక్ష పడింది. కులవివక్ష వల్ల కలిగే అనర్థాలకు ఇదొక ఉదాహరణ. దీన్ని సినిమా రూపొందిస్తామని పంకజ్ ఎస్ బాలాజీ అనే దర్శకుడు చెప్పారు.

కులహత్యలపై తమిళంలో ఇదివరకు కూడా సందేశాత్మక సినిమాలు వచ్చాయి. కాదల్, గౌరవం, వంటి సినిమాలు ఆలోచన రేకెత్తించాయి. త్రిష నటిస్తున్న గర్జనై కూడా ఇలాంటి ఇతివృత్తంలో తీస్తున్నదే. జ్యోతిక నటించిన ‘మగలిర్’ సినిమాలో అయితే కులాంతర వివాహం చేసుకునే జంటకు శంకర్, కౌసల్య అని పేర్లు పెట్టారు . తమిళంలో వాస్తవ జీవితం ఆధారంగా సినిమాలు తీస్తూ ఇతర భాషల వారికి ఆదర్శంగా నిలుస్తుంటారు. మరి తెలుగులో వీటిని ఇప్పట్లో ఆశించగలమా?