కుల బహిష్కరణ.. ఆగిపోయిన పెళ్లి..  - MicTv.in - Telugu News
mictv telugu

కుల బహిష్కరణ.. ఆగిపోయిన పెళ్లి.. 

August 4, 2020

Caste boycott in ap prakasam district.. Stopped marriage ...

మనం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం అని అనుకుంటున్నాం కానీ, భౌతికంగా ఇంకా మన ఆలోచనలు కులాలను పట్టుకునే వేలాడుతున్నాయి. ఇంకా గ్రామవ్యవస్థలో పంచాయితీలు రాజ్యం ఏలుతున్నాయి. కులమతాలు అక్కడ చిచ్చు పెడుతున్నాయి. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో రెండు కుటుంబాలను గ్రామపెద్దలు  కుల బహిష్కరణ చేశారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లిపాలెంలో ఈ అసాంఘీక సంఘటన జరిగింది. 2019లో ఓ స్థలం వివాదంలో శివయ్య అనే వ్యక్తిని కులం నుంచి కుల పెద్దలు వెలివేశారు. గ్రామ పెద్దల మాటను లక్ష్యపెట్టకుండా శివయ్యకు, నాయుడు బ్రహ్మయ్య అనే వ్యక్తి మద్దతు ఇచ్చారు. దీంతో కులం కట్టుబాట్లు పాటించలేదని బ్రహ్మయ్య కుటుంబాన్ని కూడా సదరు పంచాయితీ పెద్ద మనుషులు వెలేశారు. బ్రహ్మయ్య కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరించడమే కాదు, అతడి కుమారుడి వివాహానికి గ్రామస్థులు ఎవరూ హాజరు కావద్దని కులపెద్దలు శాసించారు. 

ఈ విషయమై గ్రామంలో చాటింపు కూడా వేయించారు. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని బ్రహ్మయ్య సోషల్ మీడియాలో ఆవేదనను వ్యక్తంచేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి పెద్దలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా స్పెషల్ టీం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు పెద్ద మనుషుల తీరును ఖండిస్తూ.. బాధితులకు మద్దతు తెలుపుతున్నారు.