క్యాస్టింగ్ కౌచ్ కథ.. క్రీస్తుపూర్వం నుంచి శ్రీరెడ్డి వరకు - MicTv.in - Telugu News
mictv telugu

క్యాస్టింగ్ కౌచ్ కథ.. క్రీస్తుపూర్వం నుంచి శ్రీరెడ్డి వరకు

April 19, 2018

ఇప్పుడు తెలుగు మీడియాలో ఎక్కడ చూసినా ఒక పదం ప్రముఖంగా వినిపిస్తోంది, కనిపిస్తోంది.. అదే క్యాస్టింగ్ కౌచ్! హాలీవుడ్, బాలీవుడ్‌లలో ఎన్నో దశాబ్దాల కిందట నుంచే వేళ్లుతన్నుకుని ఉన్న ఈ వ్యవహారాన్ని తెలుగు ప్రజలకు చెంపపెట్టులా పరిచయం చేసిన ఘనత యువనటి శ్రీరెడ్డిదే. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ సాక్ష్యాధారాలతో శ్రీరెడ్డి బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. అవకాశాలు ఇప్పిస్తామంటూ అమ్మాయిలపై భారీస్థాయిలో లైంగిక దోపిడీ జరుగుతోందని, దీనికి అడ్డుకట్ట వేయాలని బాధితులే కాకుండా మనసున్న అందరూ కోరుతున్నారు.

ఇంత వివాదం సృష్టిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ చరిత్ర ఏమిటి? అ పదం ఎలా పుట్టింది? దాహం తీరని ఈ కామపిశాచి.. సినిమాలు పుట్టాకే ఆవహించిందా? కేవలం సినిమాలకే పరిమితమా? క్యాస్టింగ్ కౌచ్ బాధితులు నోరు విప్పకపోవడానికి కారణాలేంటి? విప్పినా ఎందుకు న్యాయం జరగడం లేదు? తెలుగులో ఈ సజీవ నరమాంసదోపిడీ ఎప్పుడు మొదలైంది? ఎవరు దోషులు? ఎవరు బాధితులు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే క్యాస్టింగ్ కౌచ్ పుట్టుపూర్వోత్తరాలు పరిశీలించాలి. సినీరంగం లోతుల్లోకి వెళ్లాలి.. ఆ దిశగా మైక్ టీవీ చేస్తున్న ప్రయత్నం, అన్వేషణ ఇది..!

క్రీస్తు పూర్వం నుంచే..

మానవజాతిలో నటన తొలుత కేవలం వినోదం కోసం మొదలైంది. నటనలో నైపుణ్యం సాధించిన వారికి సమాజంలో గౌరవం, హోదా పెరిగింది. కానుకలు, భవనాలు అందాయి. ప్రాచీన నాగరికతల్లో క్రీస్తుపూర్వం రెండువేల ఏళ్ల కిందట నుంచే నాటకాలు వివిధ రూపాల్లో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దిలో గ్రీసులో నాటకం ఒక నిర్దిష్ట రూపం తీసుకుంది. అదే కాలంలో మనదేశంలోనూ నాటకాలు మొదలయ్యాయి. తొలుత మగవాళ్లే వేషాలు కట్టినా, సహజత్వం కోసం తర్వాత ఆడవాళ్లూ రంగంలోకి దిగారు. వేషాల కోసం పోటీ ఏర్పడింది. అడ్డదారులు మొదలయ్యాయి. నాటక ప్రయోక్తలు అమ్మాయిలను లైంగికంగా దోచుకున్నారు. అయితే ఇదంతా చరిత్రకు ఎక్కలేదు. కొన్ని నాటకాల్లో పరోక్షంగా ఆ ప్రస్తావనలు ఉన్నా కచ్చితమైన ఆధారాలు దొరకడం కష్టం.

అక్కడ డ్రామా కంపెనీలు.. ఇక్కడ నాటక సమాజాలు..

పాశ్చాత్య దేశాల్లో 15,16వ శతాబ్దాల్లో డ్రామా కంపెనీలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. షేక్స్‌పియర్ నాటకాలను ఆడని దేశమనేదే లేకుండా పోయింది. నటులపై జనంలో ఆకర్షణ పెరిగింది. అందగత్తెలైన నటీమణుల కోసం డ్రామా కంపెనీల యజమానులే కాకుండా ధనవంతులు, రాజులు, యువరాజులు కూడా క్యూ కట్టేవారు. నాటకరంగంలో సత్తా నిరూపించుకోవాలని తహతహలాడే అమ్మాయిలు అవకాశాల కోసం కంపెనీల యజమానులను ఆశ్రయించేవారు. వ్యవహారం పడకగదికి చేరేది. అమ్మాయి శరీరం కౌచ్‌పై నలిగిపోయేది. అయితే చాలామంది మాటకు కట్టుబడి వేషాలు ఇచ్చేవారు. అప్పట్లో మోసాలు, వంచనకు అవకాశం తక్కువ కనుక బాధితులు కూడా బజారులోకి వచ్చేవారు కాదు.. ఈ లైంగిక దోపిడీ అంతా అసంఘటితంగా కొనసాగేది. పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా భారత్, జపాన్, చైనా వంటి తూర్పు దేశాల్లోనూ ఈ పరిస్థితి సినిమాలు వచ్చేంతవరకు కొనసాగింది. మన దేశంలో ఇటీవలి వరకు ఒక వెలుగు వెలిగిన నాటక సమాజాల్లో పనిచేసిన ఏ మహిళను కదిల్చినా ఈ ఘోరాలు వెల్లడిస్తారు. అయితే ఈ నేరాలు పకడ్బందీగా సాగినవి కావు. అందుకే సమాజంలో ఇప్పటికీ నాటకాల్లో నటించే మహిళలపై చిన్నచూపు ఉంది. సినిమా తారలపై ఎంత ఆకర్షణ ఉన్నా.. ‘సినిమా వాళ్లు..’ అని శీలాన్ని శంకించే మనస్తత్వమూ వేళ్లూనుకుందన్న మాట కాదనలేని నిజం.

సినిమాలు వచ్చాక..

19వ శతాబ్ది చివరి దశకంలో చలనచిత్రాలు మొదలయ్యాయి. మొదట్లో ఆడవాళ్ల పాత్రలను మగవాళ్లే పోషించారు. ‘పరువైన ఆడవాళ్లు’ ఆ వైపు చూసేవారు కాదు. కానీ మారుతున్న కాలం, అభిరుచుల ఫలితంగా మహిళలు రంగంలోకి దిగక తప్పలేదు. సినీపరిశ్రమ వ్యాపారంగా మారిపోవడంతో సినిమాల తయారీ సంఘటిత పరిశ్రమగా మారిపోయింది. స్టూడియోలు పుట్టుకొచ్చాయి. హాలీవుడ్ నుంచి మద్రాసు వరకు లెక్కలేనన్ని స్టూడియోలు సందడి చేశాయి. కాస్త కనుముక్కు తీరు, వాచకం, అభినయం ఉన్న అమ్మాయిలకు అవకాశాలు కల్పించాయి. తారల సంఖ్య పెరిగింది. పాత్రలేమో పరిమితం. చక్కని నటీమణలు సైతం.. క్యారెక్టర్ పాత్రలకు పరిమితం కావాల్సిన పరిస్థితి. ‘ఏం చేసైనాసరే సినిమాల్లో నటించాలి.. పేరు తెచ్చుకోవాలి.. జనంతో ప్రశంసలు కురిపించుకోవాలి..’ అని పంతం పట్టిన అమ్మాయిలు స్టూడియోల చుట్టూ తచ్చాడేవారు. నిర్మాతలు, దర్శకుల దగ్గరుంచి మేకప్ ఆర్టిస్టు వరకు అందర్నీ బతిమాలుకునేవారు. అక్కడే క్యాస్టింగ్ కోచ్ పకడ్బందీగా మొదలైంది. ఇది కేవలం వేషం కోసం వచ్చే అమ్మాయిలకే పరిమితం కాకుండా వారి తల్లులు, అక్కచెల్లెళ్లపైనా లైంగికదాడులకు దారితీసింది.

ఆ కౌచ్‌లపై జరిగింది కనుక..

కొత్త సినిమా తలపెట్టినప్పుడు నటీనటులు ఎంపిక జరుగుతుంది. దీన్నే క్యాస్టింగ్ అంటారు. ఆడపిచ్చి ఉన్న నిర్మాతలు, దర్శకులు, నటులు, క్యాస్టింగ్ డైరెక్ట్, కోఆర్డినేటర్, ఇతర టెక్నికల్ నిపుణులు ఈ క్యాస్టింగ్‌ను సాకుతో అమ్మాయిలకు లోబర్చుకోవడం మొదలైంది. తమ ఆఫీసుల్లోని కౌచ్(సోఫా, మంచం)పైనే శృంగారానికి తెగబడేవారు. అందుకే క్యాస్టింగ్ కౌచ్ పదాన్ని కాయిన్ చేశారు. హాలీవుడ్, లండన్ నుంచి ముంబై, మద్రాసు వరకు ఈ వ్యవహారం నిరాటకంగా సాగుతోంది.

ఈ పేరుతో ఏకంగా సినిమానే తీశారు..

క్యాస్టింగ్ కౌచ్ పదం 1924కు ముందు పెద్దగా ప్రచారంలో లేదని అంటారు. ఆ ఏడాది ఈ పేరుతో హాలీవుడ్‌లో ఒక అడల్ట్ పోర్న్ మూకీ సినిమా వచ్చింది. ఒక అమ్మాయి సినిమాలో పాత్ర కోసం క్యాస్టింగ్ డైరెక్టర్ ఆఫీసుకు వెళ్తుంది. స్విమ్ సూట్ వేసుకునిరా అని అతడు ఆమెను గదిలోకి పంపుతాడు. తలుపు రంధ్రంలోంచి ఆమెను చూస్తాడు. తర్వాత గదిలో వచ్చి మోటుగా లైంగిక దాడికి యత్నిస్తాడు. ఆమె ప్రతిఘటించడంతో వెళ్లిపోతాడు. అక్కడి టేబుల్ సొరుగులో ఆమెకు ‘మూవీ స్టార్ కావడం ఎలా?’ అనే కరపత్రం దొరుకుతుంది. తర్వాత ఆమె మనసు మార్చుకుని అతనితో శృంగారంలో పాల్గొంటుంది. భంగిమలు, యాంగిల్స్ వంటి వాటిలో నేటి పోర్న్ మూవీలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందీ బ్లాక్ అండ్ వైట్ క్యాస్టింగ్ కౌచ్ మూవీ!

వ్యభిచారానికి, దీనికీ తేడా ఇదే..

ఇదొక రకమైన వ్యభిచారం అని కొందరు అంటారు కానీ అది సరికాదు. వ్యభిచారంలో ‘శరీరాన్ని అప్పగించి డబ్బుదస్కం ఇచ్చి పుచ్చుకోవడం’ ఉంటుంది. వ్యవహారం పడక నుంచి దిగేవరకే. తర్వాత కొనసాగింపు ఉండదు. అన్యాయం జరిగే అవకాశం కూడా ఉండదు. కానీ క్యాస్టింగ్ కౌచ్‌లో ఈ అవకాశం ఉంటుంది. అమ్మాయికి పాత్ర ఇప్పిస్తానని చెప్పే మగవాడు.. తన అవసరం తీరాక మాట నిలబెట్టుకోవచ్చు. నెలబెట్టుకోకా పోవచ్చు. వేషం ఇస్తానని చెప్పి ఆమెను తర్వాత కూడా దోచుకునే చాన్స్ ఉంటుంది. తను మాత్రమే కాకుండా మరికొందరి వద్దకూ పంపొచ్చు. పాత్ర లేదూ గీత్రా లేదు పో అని కూడా గెంటేయొచ్చు. కోర్టుకు వెళ్లడం కుదరదు. ప్రలోభం, మోసం, వంచన ఇవీ క్యాస్టింగ్ కౌచ్ నెగిటివ్ షేడ్స్. పాత్ర ఇస్తామని చెప్పడం, ఇవ్వకపోవడం, ఇచ్చినా వేరే ప్రాధాన్యం లేని పాత్ర ఇవ్వడం.. మోసం ఇలా ఎన్నోరకాల్లో ఉంటుంది..

అన్ని రంగాల్లోనూ..

క్యాస్టింగ్ కౌచింగ్ వ్యవస్థీకృత రూపం దాల్చాక అన్నిరంగాల్లో జడలు విప్పింది. ప్రభుత్వ పరిపాలన, కార్పొరేట్ రంగం, పరిశ్రమలు, స్కూళ్లు, యూనివర్సిటీలు.. ‘వేషపు శయ్య’ ఇందు గలదు అందు లేదన్నట్లు పాకిపోయిది. ఆశల్లో తేలిపోయే అమ్మాయిలు విధిలేక ఉద్యోగం, పదోన్నతి, విలాసాల కోసం కౌచ్‌లలో నలిగిపోతున్నారు. ఆశించిన ప్రతిఫలాలు కొందరికే దక్కుతున్నాయి. తనువు అప్పగించిన మోసపోతున్న మహిళలు మౌనంగా రోదిస్తున్నారు. బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని భయపడతున్నారు. ఫలానా నిర్మాత తనను వాడుకుని మోసం చేశాడని కోర్టులను ఆశ్రయించలేకపోతున్నారు.  

హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ వందలాది అమ్మాయిలపై చేసిన అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఇటీవల వెలికి రావడంతో సమస్య తీవ్రత లోకానికి అర్థమైంది. బాధితులు ‘మీ టూ’ అంటూ బయటికొస్తున్నారు. శ్రీరెడ్డిలాంటి వారు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు.

అబ్బాయిలపైనా..

క్యాస్టింగ్ కౌచ్‌కు కేవలం అమ్మాయిలే బలికావడం లేదు. అబ్బాయిలనూ కబళిస్తున్నారు. చాలామంది బాధితులు బయటికి చెప్పుకోరు. తనకు చక్కని అవకాశం ఇస్తానని చెప్పి ఓ ముంబై ధనికుడు అతనికి ఇంటికి పిలిచాడని బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణవీర్ సింగ్ చెప్పాడు. కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని అఫ్తాబ్ శివదాసనీ తెలిపాడు. అబ్బాయిలపై ఆకర్షణ ఉన్న మగనిర్మాతలు, దర్శకులు, నటకులే కాకుండా, సీనియర్ నటీమణులు.. కొత్త కుర్రాళ్లను కౌచ్‌లపై కాటేస్తున్నారు..

టాలీవుడ్‌లో..

80 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగు సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌కూ అంతే చరిత్ర ఉంది. అయితే తొలినాళ్లలో తీవ్రత తక్కువ. వంచన తక్కువ. కనుక బాధితులు కూడా తక్కువే. పైగా నిర్మాత, దర్శకుల్లో అత్యధికం మానవీయ విలువలు, స్త్రీలను గౌరవించే బీఎన్ రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం రచయితలు, సంస్కర్తలు ఉండడం వల్ల కౌచ్ వ్యవహారాలు పెద్దగా ఉండేవి కావు. రానురాను సినిమాల ఉత్పత్తి పెరడగంతో తారలు పోటీ పడ్డారు. కౌచ్ తీవ్రత పెరిగింది. టాలీవుడ్ స్వర్ణయుగంలో ఇలాంటివి జరిగాయని చెబితే నమ్మబుద్ధికాదుగాని 80ఏళ్లు పైబడిన సీనీజీవులను కదిలిస్తే కథలు కథలుగా చెబుతారు. పెట్టుబడి ఉన్న చోట నేరాలు సహజం! ధనం పేరు, ప్రఖ్యాతులతో తృప్తిపడదు. దానికి ఆడమాంసం కూడా కావాలి. పేరొందిన ఒక తెలుగు నటుడు స్టూడియోల్లో అమ్మాయిలపై హల్ చల్ చేసేవాడని అంటారు. అతడు షూటింగ్‌లో ఉంటే స్టూడియో గదుల తలుపులన్నీ తెరిచే వుంచాలని, అతడు ఏ గదిలోకి వెళ్లినా అభ్యంతర చెప్పకూడదని షరతు ఉండేదని అంటారు! రావూరి భరద్వాజ రాసిన ‘పాకుడు రాళ్లు’ నవలతోపాటు పలు నాటికాలపు సాహిత్యంలో క్యాస్టింగ్ కౌచ్ ఆనవాళ్లను, నేరస్తులను బాధితులను పోల్చుకోవచ్చు. 70,80 దశకాల్లో తెలుగు ‘వేషపు శయ్య’ నేరాలు పెరిగాయి. 90 దశకం నుంచి బాలీవుడ్, ఇతర వుడ్‌ల నుంచి తెల్లతోలు అమ్మాయిలు దాడి చేయడంతో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. వేషపు శయ్య నేరాలు పెచ్చుమీరాయి. క్యాస్టింగ్ కౌచ్ కాదుగాని టాలీవుడ్ తొలి సూపర్ స్టార్ బలైంది నిర్మాత బ్లాక్ మెయిలింగుకే అన్నది గుర్తు చేసుకోవాలి. శ్రీరెడ్డి ఈ తరం బాధితురాలు.  

అడ్డుకట్ట పడేదెలా?

Related image

శృంగారం మానవసహజాతం. లైంగిక దాడి దీని వికృతరూపం. మానవజాతికే పరిమితమైన ఘోరం. అవకాశాల కోసం యవతులు తనువును అర్పించాల్సిన పరిస్థితి ఉన్నంతవరకు ఈ ఘోరం కొనసాగుతూనే ఉంటుంది. చట్టాలు, కమిటీలు ఎన్నివేసినా ఫలితం ఉండకపోవచ్చు. అయితే దీనిపై విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల, దోషులను గుర్తించి, శిక్షించే చర్యలు తీసుకోవడం వల్ల కేసుల సంఖ్యను తగ్గించవచ్చు! ప్రస్తుతానికి ఇంతకుమించి చేసేదేమీ లేదు..!!