నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. వ్యాపారంలో నీతి అంత ఉంటుంది..! అవినీతి అక్రమాలకు పాల్పడకుండా వ్యాపారం చేయడం సాధ్యం కాని రోజులివి. సర్కారు పన్నుపోట్లు, అధిక లాభాలపై ఆశ.. కారణం ఏదైనా నష్టపోతున్నది మాత్రం ప్రజలే. చివరికి కడుపుకు తినే తిండిని కూడా లాభాల కోసం దారుణంగా కలుషితం చేస్తున్నారు.
చెన్నైలో చికెన్ బిరియానీలో పిల్లి మాంసం కలుపుతున్న విషయం వెలుగు చేసింది. పెంపుడు పిల్లుల్ల మిస్సింగ్ కేసులపై దర్యాప్తు చేస్తుండగా ఈ దారుణం బయటపడింది. తమ పిల్లులు కనిపించడం లేదని కన్నికాపురమ్, అవడి, పల్లవరం, పూమ్పుజుల్ నగర్, తిరుముల్లాయ్వోయల్ తదితర ప్రాంతాల నుంచి పోలీసులకు కొన్ని రోజులుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వారు ఆఫ్టరాల్ పిల్లులే కదా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఓ జంతు సంరక్షణ సమితి జోక్యం చేసుకుని పోలీసులపై ఒత్తిడి తెచ్చింది.
కనిపించకుండా పోయిన పిల్లులన్నీ వేడివేడి బిరియానీలోకి వెళ్ళినట్లు తేపింది. రోడ్డు పక్కన బిరియానీ అమ్ముతున్నవారు.. ఈ పిల్లులను పట్టుకుని, చంపి, చికెన్ ముక్కల్లో కలిపేస్తున్నారు. పిల్లిమాంసం కాస్త మెత్తగా ఉండడంతో ఎవరికీ పెద్దగా అనుమానం రాలేదు. రోడ్డుపక్కన తినేవారిలో పలువురు మందుబాబులు కూడా ఉండడంతో రుచితో పెద్ద పట్టింపేమీ లేకుండా పిల్లి బిరియానీని లాగించేస్తున్నారు. ఈ పిల్లి బిరియానీ వ్యాపారంపై దృష్టి పెట్టిన పోలీసులు.. వలలు వేసి పట్టుకుని తీసుకెళ్తున్న 12 పిల్లులను కాపాడారు.