మాస్క్ పెట్టుకోలేదని పోలీసుకు బడితెపూజ  - MicTv.in - Telugu News
mictv telugu

మాస్క్ పెట్టుకోలేదని పోలీసుకు బడితెపూజ 

October 2, 2020

Caught on cam Delhi cop thrashed after tiff over mask.

కరోనా లాక్‌డౌన్ సమయంలో రోడ్ల మీదకు వచ్చిన ప్రజల మీద లాఠీలు ఝళిపించారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది ప్రజలు పోలీసుల చర్యను ఖండించారు. రౌడీల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు కొట్టి చెప్పిన పోలీసులే గాడి తప్పితే ప్రజలు ఊరుకుంటారా? ఈ ప్రశ్న ఢిల్లీవాసులు వేసుకున్నట్టున్నారు. ముఖానికి మాస్కు ధరించకుండా రోడ్డు మీదకు వచ్చిన ఓ కానిస్టేబుల్‌ను పట్టుకుని ఉతికి ఆరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం (సెప్టెంబర్ 30) రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్యూటీ ముగించుకుని తన బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్న కానిస్టేబుల్‌ నరేశ్‌ను కొంత మంది వాలంటీర్లు మార్గమధ్యంలో ఆపారు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. 

ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కానిస్టేబుల్‌కు నడిరోడ్డుపైనే బడితెపూజ చేశారు. కర్రలు తీసుకుని కొట్టారు. అతని షర్టు లాగడంతో బటన్లు తెగిపోయాయి. తన పై అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇస్తున్నా వినకుండా కొట్టారు. ఈ దాడి దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. దానిని ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కార్లలో వచ్చిన ఏడు నుంచి ఎనిమిది వ్యక్తులు కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. దాడి జరిగిన సమయంలో కానిస్టేబుల్ సివిల్ దుస్తుల్లో ఉన్నారు. కానిస్టేబుల్‌పై దాడి చేసినవారంతా స్వచ్ఛంద కార్యకర్తలని సమాచారం. మరోవైపు ఆ బృందంలోని మహిళా వాలంటీర్‌ను కానిస్టేబుల్ నరేశ్ అసభ్యంగా దూషించడం వల్లే దాడి చేసినట్లు కూడా వినిపిస్తోంది. ఈ ఘటనపై కానిస్టేబుల్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు.