గవర్నర్ పదవి లేదా రాజ్యసభ సీటు ఇప్పిస్తానని మోసం చేస్తున్న ముఠాను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన కమలాకర్, కర్ణాటకకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్, అభిషేక్, మహమ్మద్ ఐజాజ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపింది. ప్రాథమిక విచారణలో మోసపూరిత హామీలతో దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లకు పాల్పడేందుకు ప్రయత్నించిన వీరిని పక్కా ప్రణాళికతో పట్టుకున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో ఈ ముఠా సీబీఐ పేరును వాడుకున్నారు. సీబీఐ సీనియర్ ఆఫీసర్గా చెప్పుకున్న కమలాకర్.. భారీగా డబ్బు వచ్చే పనిచేసి పెడుతానని, అందుకు తగ్గ కస్టమర్లను తీసుకురావాలంటూ మిగతా వారిని పురమాయించాడు. దీంతో కుట్రలో భాగంగా, గవర్నర్, రాజ్యసభ పదవి, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చైర్మెన్లుగా నియమిస్తామని చెప్తూ పలువురు ప్రైవేటు వ్యక్తులను కాంటాక్ట్ చేశారు. ఈ విషయం సీబీఐకి చేరడంతో దర్యాప్తు విభాగం రంగంలోకి దిగి ఈ నలుగురిని అరెస్ట్ చేసింది.