జీవీకే గ్రూప్‌ చైర్మన్‌కు సీబీఐ షాక్.. నిధుల మళ్లింపు కేసులో..  - MicTv.in - Telugu News
mictv telugu

జీవీకే గ్రూప్‌ చైర్మన్‌కు సీబీఐ షాక్.. నిధుల మళ్లింపు కేసులో.. 

July 2, 2020

CBI Case Against GVK Group

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జీవీకే గ్రూప్‌నకు సీబీఐ ఊహించని షాక్ ఇచ్చింది. నిధుల అవకతవకలపై కేసు నమోదు చేసింది. ఆ సంస్థ చైర్మన్ జి. వెంకట కృష్ణారెడ్డి, ఆయన కొడుకు సంజయ్‌పై అభియోగాలు మోపారు. వీరితో పాటు మరో 9 మంది పేర్లను కూడా చేర్చినట్టుగా వెల్లడించారు. 2012 నుంచి 2018 మధ్య ముంబయి ఎయిర్ పోర్టులో రూ. 805 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) కొన్ని ప్రాజెక్టులు చేపట్టాయి. దీంట్లో జీవీకేకు 50.5 శాతం, ఏఏఐకి 26 శాతం వాటాలు ఉన్నాయి. 2006లో కుదిరిన ఒప్పంద ప్రకారం, ఎంఐఏఎల్ విమానాశ్రయ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయంలో 38.7 శాతాన్ని ఏఏఐకు వార్షిక ఫీజు చెల్లించాలి. మిగతా ఆదాయంతో విమానాశ్రయాన్ని ఆధునికీకరించడం, కార్యకలాపాల నిర్వహణకు వినియోగించుకోవాలి. కానీ 9 బోగస్ కంపెనీల ద్వారా రూ. 310 కోట్ల నిధులు దారి మళ్లించినట్టుగా తేలింది. జీవీకే గ్రూప్ కంపెనీ వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏఏఐ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించింది. జాయింట్ వెంచర్ నిబంధనలను ఉల్లంఘించి జీవీకే గ్రూప్ లోకి ఈ నిధులు మళ్లించారని పేర్కొంది. దీని కారణంగా రూ. 805 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొనడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.