అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,రాజ్య సభ సభ్యుడు విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై ఉత్కంఠ వీడింది. జగన్ బెయిల్ కొనసాగుతుందా..? లేక రద్దు అవుతుందా…? అనే సస్పెన్స్‌కు తెరపడింది.
సీబీఐ కోర్టులో సీఎం జగన్‌కు రిలీఫ్ దొరికింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. బెయిల్ రద్దు చేయాలంటూ థర్డ్ పార్టీకి పిటిషన్లు వేసే అర్హత లేదని విచారణ సందర్భంగా జగన్, విజయసాయి తరపు లాయర్లు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో, గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన అంశానికి ముగింపు కార్డు పడింది. సీబీఐ కోర్టు తీర్పుతో వైసీపీ శిబిరంలో సంతోషకర వాతావరణం నెలకొంది.
ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. కానీ వీటన్నింటిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. బెయిల్ రద్దు చేయాలంటూ థర్డ్ పార్టీకి పిటిషన్లు వేసే అర్హత లేదని , అందుకు సహేతుక కారణాలు ఉండాలని,ఊహాజనిత కారణాలు ఉండకూడదని మందలిస్తూ ఆ పిటిషన్లను కొట్లివేసింది.