ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించడానికి సీబీఐ రంగం సిద్ధం చేసింది. ఈ నెల 11న హైదరాబాద్లో కవితను ఆమె నివాసంలోనే విచారించనుంది. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా ఎమ్మెల్సీకి సమాచారం ఇచ్చింది.
విచారణకు ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో ఏదైనా ఒక తేదీలో అందుబాటులో ఉంటానని కవిత చెప్పడంతో సీబీఐ 11నే ఎంపిక చేసుకుంది. ఢిల్లీ మద్య విధానంలో ఆమె జోక్యం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారం రాబట్టడానికి అధికారులు విచారించనున్నారు. వాస్తవానికి ఈ నెల 6న ఆమెను విచారనించాల్సి ఉండింది. తనకు కేసుకు సంబంధించిన పత్రాలు పంపాలని ఆమె కోరారు. ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని, వేరే పనులు ఉండడంతో హాజరు కాలేనని చెప్పారు. అయినా విచారణకు సహకరిస్తానని తెలిపారు. నిబంధనల ప్రకారం విచారించే అధికారం తమకుందని సీబీఐ తెలిపింది. దీంతో తాజా డేట్ ఫిక్స్ అయింది. సీబీఐ అధికారులు ఆమెను విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకోనున్నారు.