ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు నిమిత్తం సీబీఐ అధికారులు హైదరాబాద్ నగరానికి చేరుకున్నారని సమాచారం. అటు ఎమ్మెల్సీ కవిత మంగళవారం విచారణకు హాజరుకాలేనని, ముందస్తు కార్యక్రమాలు ఉండడం వల్ల విచారణకు ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో రావాలని లేఖ రాశారు. న్యాయ వ్యవస్థను నమ్మే వ్యక్తిగా మీ విచారణకు పూర్తిగా సహరిస్తాను. పైన చెప్పిన తేదీల్లో మీరు ఎప్పుడైనా రావచ్చని లేఖలో స్పష్టం చేశారు. దీంతో విచారణ వాయిదా పడుతుందని అంతా భావించారు.
కానీ నలుగురు సీబీఐ అధికారులు సోమవారమే నగరానికి చేరుకున్నారనే వార్త రావడంతో మంగళవారం ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అంతకుముందు ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే కవితకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ లో పేరు ఉండాల్సిన అవసరం లేదని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఈ సెక్షన్ కింద నేరానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారిని ప్రశ్నించే అవకాశం ఉందని, ఎఫ్ఐఆర్ లో పేరు ఉంటే 160 బదులుగా 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చేవారని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ కవిత మరోసారి ప్రగతిభవన్ వెళ్లారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో న్యాయపరంగా, రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీఎం కేసీఆర్ తో చర్చించేందుకు అవకాశముందని సమాచారం. మరి ఏం జరుగుతుందో రేపు పూర్తిగా తెలిసే ఆస్కారం ఉంది.