మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు కీలక దశకు చేరుకుంది. నిందితులను సీబీఐ వరసబెట్టి విచారిస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించి దర్యాప్తు సంస్థ అధికారులు శుక్రవారం మరో కీలక వ్యక్తిని విచారిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ అయిన కృష్ణమోహన్ రెడ్డిని కడప సెంట్రల్ జైలులో గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. గత శనివారం నాటి విచారణలో అవినాశ్ రెడ్డి ఇచ్చిన వివరాల్లో కొన్ని అంశాలను తీవ్రమైనవిగా సీబీఐ భావించింది. అవినాశ్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్‌లకు నోటీసులు జారీ చేసింది.
దీంతో కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ విచారణకు హాజరుకాక తప్పలేదు. కృష్ణమోహన్ విచారణ తర్వాత నవీన్ ను ప్రశ్నించనున్నారు. వివేకా హత్య తర్వాత అవినాశ్ రెడ్డి.. నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు ఫోన్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా రిటైర్డ్ అయిన కృష్ణమోహన్ జగన్‌కు చాలా సన్నిహితుడు. 2019 ఎన్నికల సమయంలో వివేకా హత్యకు గురికావడం తెలిసిందే. కడప ఎంపీ టికెట్ కోసం అవినాశ్ రెడ్డి తదితరులు ఆయనను చంపించారని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో ఈ కేసుపై విచారణ జరిపితే న్యాయం జరగదని వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టుకు ఎక్కడం, కేసును కోర్టు తెలంగాణకు బదిలీ చేయడం తెలిసిందే.