మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు చేరుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( Avinash Reddy) ని సీబీఐ అధికారులు కోఠిలోని తమ కార్యాలయంలో నిశితంగా విచారిస్తున్నారు. విచారణ సమయంలో తన పక్కన తన లాయర్ ఉండాలన్న అతని వినతిని తోసిపుచ్చారు. విచారణలో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు కూడా అనుమతించలేదు.
దీంతో లాయర్ సీబీఐ ఆఫీసు బయటే ఉండిపోవాయారు. హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయంపై అధికారులు ప్రశ్నలు సంధిస్తూ వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. మరికాసేపట్లో విచారణ ముగుస్తుందని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని సీబీఐ వర్గాలు చెప్పాయి. ఈ కేసులో సీబీఐ అవినాష్‌ను ప్రశ్నించడం ఇదే తొలిసారి.
విచారణ కోసం ఆయన కడప నుంచి శుక్రవారమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన వెంట భారీస్థాయిలో వైకాపా కార్యకర్తలు సీబీఐ కార్యాలయానికి చేరుకోగా పోలీసులు అక్కడి నుంచి పంపించారు. అవినాష్‌ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరుతున్నట్లు తెలుస్తోంది.
వివేకానంద రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పులివెందులలోని తన ఇంట్లో హత్యకు గురయ్యారు. అవినాష్ రెడ్డి, ఆయన బంధువులు రక్తపు మరకలు తుడిచి, గుండెపోటుతో చనిపోయారని నమ్మించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కడప ఎంపీ టికెట్ కోసం ఆయనను హత్య చేసినట్లు కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు. ఏపీలో తమకు న్యాయం జరగదని ఆమె సుప్రీం కోర్టును కోరడంతో కేసు హైదరాబాద్‌కు బదిలీ అయ్యింది.