CBI Raids Delhi Deputy Chief Minister Manish Sisodia Over Liquor Policy
mictv telugu

డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు.. తెలంగాణకు లింకు!

August 19, 2022

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ అగ్ర నాయకుల నివాసాలపై దాడులకు దిగింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సోదాలను నిర్వహిస్తోన్నారు సీబీఐ అధికారులు. ఆయనతో పాటు ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ నివాసంలోనూ ఏక కాలంలో దాడులు సాగిస్తోన్నారు. మొత్తంగా ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ -CBI ఈరోజు ఢిల్లీలోని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంతో సహా ఏడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించిన ఎక్సైజ్ పాలసీకి- తెలంగాణకు లింకులు ఉన్నాయని బీజేపీ నేత, వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లిక్కర్ మాఫియాతో మనీష్ సిసోడియాకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. లిక్కర్ మాఫియాతో కాంట్రాక్ట్‌ను కుదుర్చుకోవడానికి మనీష్ సిసోడియా స్వయంగా తెలంగాణకు వెళ్లారని చెప్పారు. దీంతో సీబీఐ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సీబీఐ విచారణను తాము స్వాగతిస్తామని.. తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని..అందుకే ఈ విచారణలో ఎటవంటి అవకతవకలు బయటకు రావని ట్వీట్ చేశారు. దేశంలో అందరికి నాణ్యమైన విద్య అందించడం కోసం తాను చేస్తున్న కృషిని తప్పుడు కేసుల ద్వారా నిలవరించలేరని ట్విట్టర్ లో మనీష్ సిసోడియా పేర్కొన్నారు. దేశంలో మంచి పనులు చేసే వారిని వేధించడం దురదృష్టకరమని.. అందుకే ఈదేశం ఇంకా నెంబర్ 1 కాలేదంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వపై పరోక్షంగా విమర్శలు చేశారు.