మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేగవంతంగా సాగుతోంది. ఆంద్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కేసు విచారణ బదిలీ అయ్యాక సీబీఐ దూకుడుగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలనే హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ-2 సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన సీబీఐ కౌంటర్లో సంచల విషయాలను పొందుపర్చింది. దర్యాప్తులో వెల్లడైన విషయాలను కోర్టుకు సీబీఐ వివరించింది.
బెయిల్ సరికాదు
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ది కీలక పాత్ర అని అతడికి బెయిల్ ఇవ్వడం సరికాదని సీబీఐ పేర్కొంది. వివేకా హత్య జరిగిన రోజు నిందితులందరూ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సీబీఐ తెలిపింది. కదిరి నుంచి గొడ్డలి తీసుకురావడానికి వెళ్లిన దస్తగిరి రాక కోసం సునీల్ యాదవ్, వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఎదురుచూసిన విషయంలో దర్యాప్తులో తేలిందని సీబీఐ తెలిపింది.
సునీల్ యాదవ్‌ది కీలక పాత్ర
“వివేకా హత్య సంఘటనకు ముందు ఏడాదిన్నరగా వివేకాతో కలిసి సునీల్ యాదవ్ ఉండేవాడు. తర్వాత సునీల్ యాదవ్ ప్రవర్తన నచ్చక వివేకా అతడిని దూరం పెట్టాడు. దీంతో సునీల్ యాదవ్ కక్ష పెంచుకున్నాడు. ఇదే సమయంలో హత్యకు కుట్రలో భాగంగా రూ.5 కోట్లు వాటా ఇస్తామని గంగిరెరడ్డి తెలపడంతో వారితో చేతులు కలిపాడు.”అని సీబీఐ కౌంటర్లో తెలిపింది. హత్యకు ప్లాన్ వేసిన పది రోజులు ముందు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలో వివేకా కుక్కను కారుతో ఢీ కొట్టి చంపేశారని సీబీఐ తెలిపింది.
వివేకాపై గొడ్డలితో దాడి
“2019 మార్చి 14న అర్థరాత్రి 1:30 గంటల సమయంలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలు వెనుకవైపు నుంచి వివేకానందరెడ్డి ఇంట్లోకి వెళ్లారు. కాసేపు మాట్లాడాక సునీల్ యాదవ్ వివేకా ఛాతీపై కొట్టాడు. తర్వాత దస్తగిరి నుంచి ఉమాశంకర్ రెడ్డి గొడ్డలి తీసుకుని నుదుటిపై దాడి చేశాడు. తర్వాత డ్రైవర్ ప్రసాద్ తనను కొట్టినట్లు వివేకాతో బలవంతంగా లేఖ రాయించారు. వివేకా హత్య చేసిన క్రమంలో అతని మర్మాంగంపై సునీల్ యాదవ్ తన్నాడు.”వివేకా మృతి సమాచారం కృష్ణారెడ్డి ద్వారా రాకముందే అవినాశ్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ చెప్పింది. ఘటనా ప్రదేశంలో సాక్ష్యాలను చెరిపేయడంలో అవినాశ్ పాత్ర ఉందని హైకోర్టుకు నివేదించిన కౌంటర్లో సీబీఐ వెల్లడించింది.