ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఇటీవలే ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ చేర్చగా..తాజాగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు కవితకు అందాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వివరణ ఇవ్వాలని నోటీసులో సీబీఐ పేర్కొంది. కేవలం వివరణ కోసం మాత్రమే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈనెల 6వ తేదిన ఆమె విచారణకు హాజరుకానున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు వివరణ తీసుకోనున్నారు. నోటీసులు వచ్చినట్టు కవిత కూడా వెల్లడించారు.
ఇక లిక్కర్ కుంభకోణంలో ఇటీవల వెల్లడించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ చేర్చిన సంగతి తెలిసిందే. సౌత్గ్రూప్ కంపెనీ నుంచి ఆప్ నేతలకు కనీసం రూ.100 కోట్ల ముడుపులు అందాయని.. ఈ కంపెనీని నియంత్రిస్తున్న వారిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శరత్, మాగుంట, మరికొందరు ఉన్నారని వివరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన పలు ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ వెల్లడించింది.
అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు మోదీ వచ్చే ముందు ఈడీ, సీబీఐలు రావడం సాధరణ అంశమన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తన పైనా..తన పార్టీ నేతల పైన సీబీఐ..ఈడీ కేసులు నమోదవుతున్నాయని కవిత ఆరోపించారు. ఏజెన్సీలు నమోదు చేసిన కేసులను ఎదుర్కొంటామని..విచారణకు సహకరిస్తామని కవిత వెల్లడించారు.