గూగుల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ.. వారంలో ఇది రెండోసారి - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ.. వారంలో ఇది రెండోసారి

October 26, 2022

 

CCI imposes a fine of Rs 936.44 crore on Google in second antitrust penalty this month

ప్రముఖ సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్లేస్టోర్‌ పాలసీల విషయంలో ఆ సంస్థ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా విధించింది. గూగుల్ మార్కెట్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ మంగళవారంనాడు రూ. 936.44 కోట్ల భారీ జరిమానాను వేసింది. తన పద్ధతి మార్చుకోవాలని తేల్చి చెప్పింది. గూగుల్‌కు జరిమానా విధించడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఎవరైనా యాప్ డెవలపర్ తన యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో విక్రయించాలనుకున్నా లేదా యాప్/మొబైల్ గేమ్ ద్వారా డబ్బు సంపాదించాలన్నా వారు గూగుల్ ద్వారానే చెల్లింపులు చేయాలి. యాప్స్ నిర్వాహకులు పేమెంట్స్ పొందడానికి, ఇన్ యాప్ కొనుగోళ్ల కోసం కూడా  జీపీబీఎస్(google play billing system)నే వాడాల్సి వస్తోంది. జీపీబీఎస్ వినియోగించని యాప్ డెవలపర్స్ .. వారి ప్రోడక్ట్స్ ను గూగుల్ ప్లే స్టోర్ లో లిస్ట్ చేసుకునే పరిస్థితి లేదు. అయితే భారత్‌లో ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో గూగుల్‌పై సీసీఐ రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. దీనితో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ డెవలపర్‌లకు థర్డ్ పార్టీ పేమెంట్ సిస్టమ్, యూపీఐ కింద డబ్బు సంపాదించడానికి అనుమతించాలని గూగుల్‌ని ఆదేశించింది.

దీంతో వారం రోజులు కూడా తిరగక ముందే గూగుల్‌పై సీసీఐ రెండోసారి జరిమానా విధించినట్లయింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ తో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందంటూ రూ. 1337.76 కోట్లు జరిమానా విధించాలని ఆదేశించింది. దీంతో మొత్తం జరిమానా 2274 కోట్లకు చేరింది. కాగా, తాజా జరిమానాపై గూగుల్ ఇంకా స్పందించలేదు.