తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి.. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు కాకినాడలో పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మెడకు ఉచ్చు బిగుస్తోంది. తీసుకున్న డబ్బులు చెల్లించే విషయంలో సుబ్రహ్మణ్యం, అనంతబాబు మధ్య గొడవ జరిగిందని, ఈ గొడవలో అనంతబాబు అతడ్ని వెనక్కి నెట్టగా.. తలకు గాయమై చనిపోయాడనే కథనం ప్రస్తుతం కొన్ని మీడియా ఛానెళ్లలో వినిపిస్తోంది. కానీ అసలు కథ వేరట.
హత్య జరిగిన రోజు ఎమ్మెల్సీ అనంతబాబు అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్‌లో విస్తుపోయే విషయాలు రికార్డయ్యాయి. ఆ రోజు అనంతబాబు చాలా హాడావుడిగా కారులో తన అపార్ట్మెంట్కి వెళ్లారు. ఆ సమయంలో గన్మెన్లతో పాటు అనుచరులు కూడా ఆయన వెంటే ఉన్నారు. తన ఫ్లాట్‌కి హడావుడిగా వెళ్లి మళ్లీ తిరిగి వెళ్లి పోయారు. ఇవన్నీ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. శ్రీరామ్‌నగర్ కొండాయపాలెంలోని శంకర్అపార్ట్ మెంట్లో ఎమ్మెల్సీ నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి 1 గంట దాటాక కారులో ఇంటికి వెళ్లారాయన. ఆయనతో పాటు గన్మెన్లు కూడా ఉన్నారు. అయితే అప్పటికే కారులో డెడ్‌బాడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎపిసోడ్‌పై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.