నటుడు తారకతర్న మరణవార్త తెలుగు రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. చిన్న వయుస్సులోనే మరణించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తారకరత్నపై మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తారకరత్న మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, మంత్రలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తదితరులు సంతాపం ప్రకటించారు.
వెంకయ్య ఆవేదన
తారకరత్న మృతితో తాను ఎంతో విచారించానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయన గుండెపోటుకు గురైన నాటి నుంచి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నానని చెప్పారు. ఇంతలోనే మరణవార్త వినాల్సి రావడం విచారకరమన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వెంకయ్యనాయుడు.
పవన్ సంతాపం
‘‘నటుడు శ్రీ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. శ్రీ తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు
షాక్‌కి గురయ్యా :మహేష్ బాబు
తారకరత్న మరణవార్త విని షాక్‌కి గురైనట్లు హీరో మహేష్ బాబు తెలిపారు. ఇంత చిన్న వయుసులోనే మనల్ని వీడి వెళ్ళడం నిజంగా బాధాకారమన్నారు. తారకరత్న కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.