రాష్ట్రవ్యాప్తంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ పీవీఘాట్ వద్ద వివిధ పార్టీలకు చెందిన నాయకులు దివంగత నేతకు ఘననివాళి అర్పించారు. దేశానికి పీవీ అందించిన సేవలను గుర్తుచేసుకున్న నేతలు.. ప్రజాసేవకు ఆయన బాటలో పయనిస్తామని తెలిపారు.
బహుభాషా కోవిదుడైన పీవీ నరసింహారావు దేశానికి, మాతృభాషాభివృద్ధికి విశేష కృషి చేశారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. పీవీ 18వ వర్ధంతిని పురస్కరించుకుని.. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని దివంగత నేత సమాధి వద్ద ఆమె పూలమాలలు ఉంచి, నివాళి అర్పించారు.
పీవీ నరసింహారావుతో తనకున్న అనుబంధాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేతలు వీహెచ్, కేవీపీ, శ్రీధర్‌బాబుతో కలిసి పీవీ ఘాట్‌లో దిగ్విజయ్ నివాళి అర్పించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే.. ప్రధానిగా ఉన్న పీవీ దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరిచారని దిగ్విజయ్ తెలిపారు.
పీవీ నర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే పీవీ నర్సింహారావుకు భారతరత్న పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించాలన్నారు.పీవీ 18వ వర్ధంతి సందర్భంగా మంత్రి తలసాని.. పీవీ మార్గ్‌లోని పీవీ ఘాట్ దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.