సొంతిల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి సిమెంట్ కంపెనీలు షాకిచ్చాయి. సిమెంట్ ధరలను భారీగా పెంచేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు నిన్నటి నుండే అమల్లోకి వచ్చాయి. ముడి పదార్థాల అధిక ధరలతో పాటు పెట్రోల్, డీజీల్ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి.
తెలుగు రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంట్ బస్తాపై రూ.20 పెంచగా, తమిళనాడులో రూ.20-30 మధ్య పెరిగింది. కర్ణాటకలో బ్రాండ్, ప్రాంతం ఆధారంగా ధరల పెంపు వేర్వేరుగా ఉందని తెలుస్తోంది. ధర పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిమెంట్ బస్తా ధర రూ.320-400 మధ్య, తమిళనాడు, కర్ణాటకల్లో రూ.360-450కు చేరింది. ధరలు పెంచిన సిమెంట్ కంపెనీలలో అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, కేసీపీ, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, సాగర్ సిమెంట్స్, దాల్మియా భారత్, శ్రీ సిమెంట్, రామ్కో సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్ ఉన్నాయి.