కొత్తగా ఇల్లు నిర్మించాలనుకునే వారికి చేదు వార్త ఇది. ఇప్పటికే స్టీలు, ఇసుక ధరలు పెరిగి సతమతమవుతుండగా, ఇప్పుడు ఇంటి నిర్మాణంలో కీలకమైన సిమెంట్ ధరలు పెరగనున్నాయనే వార్త ఆందోళన కలిగిస్తోంది. నెలవారీగా చూసుకుంటే నిర్మాణ వ్యయం పెరుగుతూ వచ్చి తడిసిమోపెడవుతోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంట్ బస్తా రూ. 370 నుంచి రూ. 450 మధ్య పలుకుతోంది. ఆగస్టు నుంచి చూస్తే బస్తాకు రూ. 16 పెరిగింది. గతనెలలోనే ఏడు రూపాయలు పెరగ్గా, ఇప్పుడు రూ. 10 నుంచి రూ. 15 వరకు పెరిగే అవకాశాలున్నాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉండగా, త్వరలో నిర్ణయం వెలువడుతుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా చూస్తే తూర్పు, మధ్య భారతంలో డిమాండ్ స్తబ్దుగా ఉన్నా పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారతంలో ఇంటి నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో విపరీతమైన డిమాండ్ నెలకొనడంతో సిమెంట్ కంపెనీ షేర్లు కూడా పుంజుకున్నాయి.