టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక.. జాగ్రత్త - MicTv.in - Telugu News
mictv telugu

 టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక.. జాగ్రత్త

April 23, 2022

కేంద్ర ప్రభుత్వం వార్తా ఛానెళ్లను హెచ్చరించింది. చట్టాలకు అనుగుణంగా హెడ్‌లైన్స్ ఉండేలా సరి చూసుకోవాలని సూచించింది. జహంగీర్‌పురి హింస, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన వార్తలు రాసేటప్పుడు గాని, వాటిని ప్రసారం చేసేటప్పుడు గాని తగిన జాగ్రత్తలు పాటించాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా, ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రసారం చేసేటప్పుడు వాటి శీర్షికలు, ట్యాగ్‌లైన్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. వాయువ్య ఢిల్లీలో జరిగిన ఘటనలకు సంబంధించి, టీవీ ఛానళ్లలో చర్చలు అన్‌పార్లమెంటరీగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని, సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాషను ఉపయోగించారని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పేర్కొంది.

మరోపక్క జహంగీర్‌పురి హింసాత్మక ఘటన విచారణకు మీడియా కవరేజీ ఆటంకం కలిగిస్తోందని పేర్కొంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఊరేగింపులో రాళ్లు రువ్వినట్టు ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పై ఘటనలకు సంబంధించి కంటెంట్‌ను ప్రసారం చేసే పద్ధతిలో టీవీ చానళ్లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మంత్రిత్వశాఖ జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది.