Center big shock to 13 states..ban on electricity
mictv telugu

13 రాష్ట్రాలకు కేంద్రం బిగ్‌షాక్..కరెంటుపై నిషేధం

August 19, 2022

కేంద్ర ప్రభుత్వం దేశంలోని 13 రాష్ట్రాలకు బిగ్‌షాక్ ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంట్ కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించింది. అందుకు కారణాలు ఏంటో తెలియజేస్తూ, గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ నిషేధంతో ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు తప్పవా? అనే ప్రశ్న అధికారుల్లో మొదలైంది.

కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో.. మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపుర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, జుమ్మూ-కాశ్మీర్, బీహార్, జార్ఘండ్, మిజోరం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాలు విద్యుత్తు సరఫరా చేయరాదని నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్‌డీసీ), ఎనర్జీ ఎక్స్‌చేంజ్‌ సంస్థలను కేంద్ర విద్యుత్తు శాఖ ఆదేశించింది.

”ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) రూ.104.6 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) రూ.197.67 కోట్లు, తెలంగాణ స్టేట్‌ పవర్‌ కోఆర్డినేషన్‌ కంపెనీ (టీఎస్‌పీసీసీ) రూ.1,078.69 కోట్లు కలిపి సుమారు రూ.1,380 కోట్ల మేర విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా చాలా విద్యుత్‌ సరఫరా సంస్థలు గడువు తీరి నెల రోజులైనా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 విద్యుత్‌ సంస్థల బకాయిలు రూ.5,085.30 కోట్లకు చేరాయి” అని కేంద్ర విద్యుత్‌ శాఖ తన ‘ప్రాప్తి వెబ్‌ పోర్టల్‌లో ప్రకటించింది.

ఈ నిషేధంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ..”హైకోర్టు స్టే ఇచ్చినా విద్యుత్తు ఎక్స్‌చేంజ్‌లో ఇబ్బందులు పెట్టడం సరికాదు. ఇప్పటికే రూ.1,370 కోట్ల బిల్లులు చెల్లించాం. కేంద్రం తీరుపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేస్తాం. రాష్ట్రంలో విద్యుత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకొంటున్నాం. అందుబాటులో జల విద్యుత్తు ఉండటం మనకు కలిసి వచ్చేదే. ప్రజలు, వినియోగదారులు, విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వానికి సహకరించాలి” అని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పిలుపునిచ్చారు.