ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

March 5, 2022

01

ఉక్రెయిన్‌లో అర్ధంతరంగా చదువు ఆగిపోయిన భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆగిపోయిన ఆయా కోర్సులను పూర్తిచేసే అవకాశాన్ని మన దేశంలోనే కల్పిస్తున్నామని తెలిపింది. దీనిలో భాగంగా ఆరేళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇంటర్న్‌షిప్ మధ్యలో ఉన్న, ప్రారంభించాల్సిన విద్యార్థులకు అవకాశాన్ని కల్పించాలని జాతీయ వైద్య కమిషన్(ఎస్ఎంసీ) నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి కొన్ని షరతులకు లోబడి అనుమతించింది. డిగ్రీ వైద్య (ఎంబీబీఎస్) విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఎంసీ, నీతిఆయోగ్, విదేశీ వ్యవహారాల, ఆరోగ్య మంత్రిత్వ శాఖల అధికారులు త్వరలో భేటీ కానున్నారు. దేశంలోని ప్రైవేటు వైద్య కళాశాల్లో వీరికి ప్రవేశాలు కల్పించే యోచనలో ఉన్నారు. దీని కోసం ఎస్ఎంసీ నిబంధనలను సడలించే అవకాశం ఉంది.

మరోపక్క ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా 2022 అనే పేరుతో ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే స్వంత ప్రాంతాలకు చేరుకున్న విద్యార్థులు.. యుద్ధం కారణంగా ఆగిపోయిన తమ చదువులు ఎలా కొనసాగించాలి అనే సందిగ్ధంలో ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.