ఏపీ ప్రభుత్వానికి షాక్.. దిశ బిల్లును వెనక్కి పంపిన కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రభుత్వానికి షాక్.. దిశ బిల్లును వెనక్కి పంపిన కేంద్రం

February 4, 2020

jkjkfv

ఆంధప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కు పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేయాలని సూచించింది. ఈ దిశ బిల్లులో పొందుపరచిన 7వ షెడ్యూల్‌లో ఎంట్రీలు సరిగ్గాలేవని.. వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు సమాచారం. కేంద్రం చెప్పిన సవరణల్ని అధికారులు సరిచేస్తునారు. త్వరలోనే దిశా బిల్లును కేంద్రానికి పంపిస్తారు. కేంద్రంలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గరకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదించాక దిశ చట్టం అమల్లోకి వస్తుంది.

దిశ చట్టం ముఖ్యాంశాలు:

* కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నిర్భయ చట్టంప్రకారం అత్యాచార దోషులకు జీవిత ఖైదు లేదా మరణదండనను శిక్షగా విధిస్తారు. దిశా చట్టం ప్రకారం రేప్‌ చేసినవారికి తప్పనిసరిగా మరణదండన విధిస్తారు.

* నిర్భయ చట్టం ప్రకారం 2 నెలల్లో దర్యాప్తు పూర్తి, మరో 2 నెలల్లో శిక్షలు అమలు చేయాలి. దిశ చట్టం ప్రకారం వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తి కావాలి. 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. పక్కా ఆధారాలు(కంక్లూజివ్‌ ఎవిడెన్స్‌) లభించినట్లయితే 21 రోజుల్లోపే దోషికి ఉరి శిక్ష పడాలి.

* అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష విధించవచ్చు. దిశ చట్టం ప్రకారం ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలు చేసినా జీవితాంతం జైల్లో ఉండాలి. 

* అత్యాచార నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు దర్యాప్తు 7 రోజుల్లో చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తి చేసేలా దిశ చట్టంలో చేర్చారు.

* సోషల్‌ మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్యకర పోస్టులు పెట్టడం లాంటివి చేస్తే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) ప్రకారం ఇప్పటి వరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. ఈ చట్టం ద్వారా ఈ-మెయిల్స్‌ ద్వారా గాని, సోషల్‌ మీడియా ద్వారా గాని, డిజిటల్‌ విధానంలోగాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే మొదటి తప్పుకు 2 ఏళ్లు, ఆ తర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354(ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకువచ్చారు.

* ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మహిళలపై, పిల్లలపై నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కొద్ది రాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులున్నాయి. కానీ, జిల్లాకు ఒకటి ఎక్కడా లేదు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అది కూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోర్టుల్లో అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, అసభ్యకర సోషల్‌ మీడియా పోస్ట్‌లు, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి తీసుకువచ్చారు.

* ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్రప్రభుత్వం చట్టంలో ఉన్న 6 నెలల కాలాన్ని రాష్ట్ర పరిధిలో కేవలం 3 నెలలకు కుదించారు.

* మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇప్పటివరకూ ఎటువంటి ఏర్పాట్లు లేవు.  జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ఈ చట్టం ద్వారా వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు.

* మహిళలు, పిల్లలపై నేరాలను నమోదు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉంచి, జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరగాడు, ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కానీ, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడం ద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెట్టనున్నారు.