ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రైవేట్ పరం చేస్తోంది. తాజాగా ఏపీలోని మూడు విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానశ్రయాలను ప్రైవేట్ పరం చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని రాజ్యసభ వేదికగా కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకేసింగ్ వెల్లడించారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణపై కేరళ సీపీఎం సభ్యుడు ఎలమారం కరీం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ కింద కేంద్ర ప్రభుత్వం 2022–25 మధ్యకాలంలో దేశంలో 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ లిస్ట్‌లో తిరుపతి, రాజమండ్రి, విజయవాడ విమానాశ్రయాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశంలోని 8 విమానాశ్రయాలను పబ్లిక్ – ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో లీజుకు ఇచ్చారు.
మరోవైపు వైసీపీ సర్కార్ పీపీపీ విధానంలో నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు 2203 ఎకరాలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 2160.47 ఎకరాలు సేకరించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి రూ.2500 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వెల్లడించారు.రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు . విమానాశ్రయం తొలి దశ పనులు పూర్తయితే… ప్రతి ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల అవసరాలు తీరుతాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 15 అంతర్జాతీయ విమానాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.