Center is conducting raids on those who question the Central Government
mictv telugu

దర్యాప్తు సంస్థల్ని వేటకుక్కల్లా ఉసిగొల్పుతున్నారు.. మంత్రి కేటీఆర్

February 28, 2023

Center is conducting raids on those who question the Central Government

కేంద్రంలో ఉన్న బిజెపి అరాచక పాలనను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రి తన కింద ఉన్న సీబీఐ, ఐటీ లాంటి సంస్థలను వేటకుక్కల్లాగా ఉసిగొల్పి కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం లాంటి దిక్కుమాలిన పనులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులకు భయపడేది లేదని.. ఎంతదాకనైనా పోరాడుతామని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశాపల్లిలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

కేసీఆర్‌ను విమర్శించేందుకు విపక్షాలకు మరే కారణం దొరక్క కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు. అయితే తమది ముమ్మాటికి కుటుంబ పాలనే అని, 60 లక్షల మంది రైతులున్న కుటుంబానికి రూ.60 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్ష ఇస్తున్న మేనమామ… సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామపంచాయతీల్లో 19 తెలంగాణ నుంచే ఎంపికయ్యాయని కూడా తెలిపారు.

కరోనా వ్యాక్సిన్‌ను ప్రధాని మోదీయే కనిపెట్టాడని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయనకు మెదడు మోకాళ్లలో ఉన్నదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నాడని, ఈయన ఎంపీ అయింది ఇందుకేనా? అని నిలదీశారు. మోదీ ఎవనికి దేవుడో, ఎందుకు దేవుడో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతున్నందుకు మోడీ దేవుడా? అని ప్రశ్నించారు. ఆదానికి దేవుడు కావొచ్చు కానీ.. తెలంగాణ ప్రజలకు దేవుడు కాదన్నారు. బీజేపీకి హిందు.. ముస్లీం తప్ప మరోకటి తెల్వదన్నారు.

వేధింపులకు గురై మృతి చెందిన ప్రీతి విషయంలో కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయిన వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.