తెలంగాణ అప్పులపై కేంద్రం స్టే.. పలు పథకాలపై ప్రభావం! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ అప్పులపై కేంద్రం స్టే.. పలు పథకాలపై ప్రభావం!

May 10, 2022

తెలంగాణ ప్రభుత్వానికి అప్పుల విషయంలో కేంద్రం షాకిచ్చింది. అప్పులకోసం పెట్టుకున్న దరఖాస్తులకు గ్యారంటీ ఇవ్వకుండా నిలిపివేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం పరిశీలించి, అప్పు ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని, అప్పటివరకూ ఆగాల్సిందేనని స్పష్టం చేసింది. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ విషయం తేల్చిచెప్పారు. స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి ప్రతీ ఏడాది అప్పులు చేస్తుంటాయి. తమ జీఎస్డీపీలో కేంద్రం అనుమతించిన మేర రాష్ట్రాలు అప్పు తీసుకోవచ్చు.

అయితే శ్రీలంక లాంటి పరిస్థితులు రావొద్దనే ముందుజాగ్రత్తతో కేంద్రం అన్ని రాష్ట్రాల అప్పులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తెలంగాణతో పాటు ఏపీ, కేరళ రాష్ట్రాల అప్పులపై మరింత పరిశీలన అవసరమని స్పష్టం చేసింది. అంతేకాక, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను కూడా రాష్ట్ర అప్పులుగా పరిగణిస్తామని కొత్త షాకిచ్చింది. అదికూడా 2020-21 ఆర్ధిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పింది. అయితే కేంద్రం వైఖరిపై తెలంగాణ ఆర్ధిక శాఖ అధికారులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పులు మూలధన వ్యయం కోసమే తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తెలంగాణ నడుచుకుందని చెప్పారు. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు కూడా లేకుండా హఠాత్తుగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణకు ఏప్రిల్‌లో 3 వేల కోట్లు, మే 2న మరో 3 వేల కోట్ల రుణం రాకుండా ఆగిపోయింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు మరింత సహాయం చేయాల్సింది పోయి వివక్ష చూపుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు.