తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాశారు.
ఆ లేఖలో..’తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వ్యాప్తి అధికమైంది. కరోనా మహమ్మారిపై తీవ్ర పోరాటం సాగించి సాధించిన ఫలితాలను వృథా చేయరాదు. ఆ ఆధిక్యతను నిలుపుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యాప్తి మరింత ఉద్ధృతం కాకుండా కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించాలి. ఇది సమష్టి యజ్ఞం. ఇందులో ఏదైనా సహాయం కావాల్సి వస్తే సహాయం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ సిద్ధంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
మరోపక్క దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,962 కేసులు నమోదయ్యాయి. 2,697 మంది కరోనా నుంచి కోలుకోగా, 26 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 22,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,72,547. మొత్తం 4,26,25,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,677 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా, క్రియాశీల రేటు 0.05 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు శనివారం వివరాలను వెల్లడించారు.