కాపుల రిజర్వేషన్లపై కేంద్రం బుధవారం కీలక ప్రకటన చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏ కులానికైనా రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. ఓబీసీ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఏ కులానికైనా రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని తేల్చి చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశమని గుర్తు చేశారు. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్రాలు సొంత జాబితాను రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆయా తరగతులకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించవచ్చన్నారు. కాగా, ఏపీలో కాపులకు 2019లో టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం పది శాతంలో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ బిల్లులో పేర్కొంది. ఈ విషయంలో తాజా పరిణామంతో సీఎం జగన్ కి ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయని చెప్తున్నారు. కాపు రిజర్వేషన్ బిల్లుపై కోర్టులు, కేంద్రం పెండింగులో పెట్టాయంటూ చెప్పుకొచ్చారని, ఇప్పుడు ఏం చెప్తారని ఆ సామాజిక వర్గ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.