Center's key decision..Heavy fine for not wearing seat belt
mictv telugu

కేంద్రం కీలక నిర్ణయం..సీట్ బెల్ట్ ధరించకుంటే భారీ జరిమానా

September 7, 2022

Center's key decision..Heavy fine for not wearing seat belt

దేశవ్యాప్తంగా టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదం ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీటు బెల్ట్ ధరించకపోవటంతో డివైడర్‌ను ఢీకొని కారులో ఉన్న ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతితో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం..సైరస్ మిస్త్రీలా ఎవరు మృతి చెందకూడదని, ఇక నుంచి రోడ్డు ప్రమాదాలను ఆరికట్టేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కారులో ప్రయాణించే, ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, లేకపోతే వెయ్యి రూపాయల జరిమానాను విధిస్తామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు.

నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..”కారులోని వెనక సీట్లలో కూర్చునే ప్రయాణికులు సీట్ బెల్ట్‌ పెట్టుకోవడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. సీటు బెల్టు అవసరం లేదనే భావనలో వారుంటారు. ఇకపై ముందు, వెనక సీట్లలో కూర్చొన్న ప్రతి ఒక్కరు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాల్సిందే. నేను పలువురు ముఖ్యమంత్రులతో కలసి కారులో ప్రయాణించిన సందర్భాలున్నాయి. వారితో ప్రయాణించేటప్పుడు నేను ముందు సీట్‌లో కూర్చున్నాను. ఆ సమయంలో వారు కారు భద్రతా నియమాలు పాటించలేదు. ఒకవేళ మనం సీట్ బెల్ట్‌ పెట్టుకోకపోతే అలారం మోగుతుంది. కానీ, డ్రైవర్లు క్లిప్‌ పెట్టి అలారం ఆపేవారు. ఇక్కడ మనకు సహకారం ఉంటేనే ప్రమాదాలు ఆగుతాయి. అందుకే ఇకపై సీటు బెల్ట్ ధరించని కారణంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రూ.1000 జరిమానా విధించాలన్న నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాం” అని ఆయన అన్నారు.