గుడ్ న్యూస్.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్ న్యూస్.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

June 15, 2022

దేశంలో ప్రస్తుతం నడుస్తున్న 4జీ టెక్నాలజీ కంటే వేగంగా బ్రాడ్ బ్యాండ్ సేవలందించే 5జీ టెక్నాలజీకి కేంద్రం అనుమతులిచ్చింది. అందుకు సంబంధించిన స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జులై నెలాఖరు నాటికి స్పెక్ట్రాన్ని వేలానికి తీసుకురానున్నట్టు వెల్లడించింది. దీని ద్వారా నూతన వ్యాపార, ఉద్యోగ అవకాశాల సృష్టి సాధ్యపడుతుందని, ప్రజల మెరుగైన జీవన విధానానికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. ‘ప్రభుత్వ మానస పుత్రికలైన డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలకు డిజిటల్ కనెక్టివిటీ అనేది అతి ముఖ్యమైన అంశంగా ఉంది’ అంటూ ప్రకటన విడుదల చేసింది. కాగా, 2015లో ప్రారంభమైన 4జీ సేవలు ప్రారంభమయినాయి. అప్పుడు కేవలం 10 కోట్ల మంది 4జీ సేవలను వాడుతుండగా, 2022 నాటికి ఆ సంఖ్య 80 కోట్లకు చేరింది. బ్రాడ్ బ్యాండ్, ముఖ్యంగా మొబైల్ బ్యాడ్ బ్యాండ్ వల్ల ప్రజల రోజువారీ జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి. డేటా వినియోగం, సమాచార విప్లవం, ఇంటర్నెట్ సేవలు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ వ్యక్తి చేతికి చాలా చవకగా అందాయి. ఇదిలా ఉంటే, 6జీ టెక్నాలజీ గురించి ఇప్పటికే పరిశోధనలు మొదలయ్యాయి.