తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో 15 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఈసీ (EC) షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అలాగే.. తెలంగాణలో ఒక టీచర్స్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏపీ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు ఉండగా.. తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలోని రెండు స్థానాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వారి పదవీకాలం త్వరలోనే ముగియనుండటంతో ఈసి షెడ్యూల్ రిలీజ్ చేసింది. హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు .. హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నిక జరిగే ఒకే ఒక స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది.ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి దీపక్ రెడ్డి, కడప నుండి బిటెక్ రవిల పదవీకాలం మర్చి 29న ముగియనుంది. ఇక నెల్లూరు నుంచి వాకాటి నారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరి నుండి రామ్మోహన్ రావు, మంతెన సత్యనారాణయన రాజు, తూర్పు గోదావరి చిక్కాల రామచంద్రరావు, చిత్తూరు రాజనర్సింహులు, కర్నూల్ నుండి ప్రభాకర్ పదవి కాలం మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈసీ (Election Commission) షెడ్యూల్ రిలీజ్ చేసింది.