ఇండియాలో ముగిసిందనుకున్న కరోనా మరోసారి ముంచుకువచ్చే ప్రమాదం ఉండనుంది. మనదేశంలో కాకపోయినా చైనా, జపాన్, కొరియా, బ్రెజిల్ దేశాలలో మహమ్మారి విజృంభిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇది కరోనా నాలుగో వేవ్ కావొచ్చని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దేశంలో ఇక నుంచి కరోనా సోకిన వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని ఆదేశించింది. ఇప్పుడు సోకుతున్న వైరస్ ఏ వేరియంట్ అన్నది తెలుసుకోవాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో ఈ ముప్పు తొలగిపోలేదన్న విషయం అర్ధమవుతోందని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు. కేసులను ట్రేస్ చేయడం ద్వారా కొత్త వేరియంట్ల ఉనికిని గుర్తించవచ్చని, దాంతో అవసరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందన్నారు. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.