central government announced a mega textile park for telangana PM modi tweet
mictv telugu

రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్..మరో మెగా ప్రాజెక్ట్

March 18, 2023

central government announced a mega textile park for telangana PM modi tweet

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి మరో మెగా ప్రాజెక్ట్ రాబోతోంది. ప్రధాన మంత్రి మిత్ర పథకంలో భాగంగా మెగా టెక్స్‏టైల్ పార్క్‏ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టును కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్స్‏టైల్ పార్కుల ఏర్పాటుతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షాలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ మెగా ప్రాజెక్టు కోసం దాదాపు 13 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇందులో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర జౌళి శాఖ ఎంపిక చేసింది.

ఎకోసిస్టమ్, కనెక్టివిటీ, మౌలిక, సదుపాయాలను పరిగణలోకి తీసుకుని పార్కులను ఏర్పాటు చేసినట్లు జౌళి శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఒక్కో రాష్ట్రం వెయ్యి ఎకరాల వరకు భూమిని కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాదు విద్యుత్, నీటి వసతి, వ్యర్థ జలాల నిర్వహణ వంటి వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మెగా టెక్స్‏టైల్ పార్క్‏కు సంబంధించి మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ..”ఈ 7 రాష్ట్రాలు ఎంతో సంతోషించాల్సిన రోజు ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. టెక్స్‏టైల్ ఇండస్ట్రీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‏లో పోటీపడే సామర్థ్యం భారత్‏కు ఉంది. పోటీతత్వ ప్రోత్సాహక మద్దతుగా రూ. 300 కోట్లు అందిస్తాం. ఈ పథకం కోసం బడ్జెట్‏లో రూ.4,455 కోట్లు కేటాయించాం” అని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలోనూ మెగా టెక్స్‏టైల్ పార్కును ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఎట్టకేలకు ఈ విషయంపై కేంద్రం తాజాగా స్పందించి తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. టెక్స్‏టైల్ పార్క్ రాష్ట్రానికి రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇది మోదీ కానుక అని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు, చేనేత కార్మికులకు, యువతకు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు.