గుజరాత్‌లో కేంద్రం కొత్త ఎత్తుగడ.. వారికి పౌరసత్వం ఇస్తూ నోటిఫికేషన్ జారీ - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్‌లో కేంద్రం కొత్త ఎత్తుగడ.. వారికి పౌరసత్వం ఇస్తూ నోటిఫికేషన్ జారీ

November 1, 2022

దేశ విభజన తర్వాత సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లలో ఉండిపోయిన మైనార్టీలకు పౌరసత్వం కల్పిస్తూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సీఏఏ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్రం కొంత వెనక్కి తగ్గింది. కేవలం ఆ పార్టీ అధికారంలో ఉన్న అసోంలో మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయగలిగింది.

కానీ, తర్వాత జరిగిన పరిణామాలను గమనించి ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదు. కొద్ది నెలల్లో మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ చట్టం అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పైన పేర్కొన్న దేశాల్లో మైనార్టీలుగా ఉంటూ భారత దేశం వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆనంద్, మొహసానా జిల్లాల్లో నివసిస్తున్న మైనార్టీలకు పౌరసత్వం కల్పించే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 2014లో తెచ్చిన సీఏఏ చట్టం ద్వారా కాకుండా 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వం ఇవ్వనుంది. అక్కడ అమలు చేసిన తర్వాత వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సమాయాత్తమవుతోంది. అదే సందర్భంలో కేంద్రంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున వలస వాదుల ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అలాగే వలస వచ్చిన వారిలో ఎక్కువగా హిందువులే ఉంటారు కాబట్టి బీజేపీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.