చిక్కుల్లో సోనియా, రాహుల్.. దర్యాప్తుకు కేంద్రం ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

చిక్కుల్లో సోనియా, రాహుల్.. దర్యాప్తుకు కేంద్రం ఆదేశం

July 8, 2020

rahul

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి భారీగా విరాళాలు మళ్లించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. 1991లో మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉండగా..5 ఏళ్ళ పాటు సంవత్సరానికి 20 కోట్ల చొప్పున మొత్తం 100 కోట్లను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి ఇస్తున్నట్టు ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారని నడ్డా గుర్తు చేశారు.

దీంతో గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోన్న రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపనుంది. ఈ ట్రస్టులు ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను, విదేశీ విరాళాలకు సంబంధించిన రూల్స్ ని ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ట్రస్టులకు విరాళాలు ఎక్కడినుంచి వసిస్తున్నాయని ఆదాయ పన్ను శాఖ అధికారులు తేల్చనున్నారు. వీటిపై దర్యాప్తును సమన్వయ పరచేందుకు అంతర్ మంత్రివర్గ కమిటీని హోమ్ శాఖ ఏర్పాటు చేసింది. మనీ లాండరింగ్, ఆదాయపు పన్ను చట్టం, ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం వంటి చట్టాల నిబంధనలను ఇవి అతిక్రమించాయని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి చెందిన స్పెషల్ డైరెక్టర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని ఈ శాఖ వెల్లడించింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని 1991 లో రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ని 2002 లో ఏర్పాటు చేశారు. ఈ రెండు ట్రస్టులను  సోనియా గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ బోర్డులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సభ్యులుగా ఉన్నారు. దీంతో ఈ వివాదం వారి మెడకు కూడా చుట్టుకోనుంది.