కశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. వారే స్థానికులు..  - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. వారే స్థానికులు.. 

April 1, 2020

Central government redefines Jammu and Kashmir domicile rules

కరోనా వైరస్ కారణంగా యావత్ దేశం లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెల్సిందే. దీంతో దేశంలోని ఎక్కడి ప్రజలైన జమ్మూకశ్మీర్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకోవచ్చని, ఉద్యోగాలు పొందవచ్చన్న భయం స్థానికుల్లో నెలకొంది. వారి భయాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కశ్మీర్‌లోని స్థానికత నిబంధనలతో పాటు ఉద్యోగ అర్హతలపై కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

కొత్తగా రూపొందించిన మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో నిరాటంకంగా 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నవారు లేదా ఏడు సంవత్సరాల పాటు జమ్మూకశ్మీర్‌లో విద్యనభ్యసించిన వారు, పదో తరగతి, ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్న వారిని స్థిర నివాసులుగా పరిగణలోకి తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, సెంట్రల్ యూనివర్శిటీల అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పరిశోధనా సంస్థల తరపున జమ్మూకశ్మీర్‌లో దాదాపు పది సంవత్సరాలు పనిచేసే వారందర్నీ ఇకపై స్థానికులుగా గుర్తించనున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలు రూ.25,500 ప్రాథమిక జీతం ఉన్న అన్ని ఉద్యోగ నియామకాలకూ వర్తిస్తుందని తెలిపారు.