ప్రాణాంతక కరోనా వ్యాధి రాకుండా వేయించుకుంటున్న టీకాలతో కొన్ని దుష్ప్రభావాలు కలుగుతున్నాయని తరచూ వింటుంటాం. జ్వరం, ఒళ్లు నొప్పులు సర్వసాధారణం అని తెలుసు. కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించినట్లు వార్తలు వచ్చాయి. మనదేశంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. రోగం రాకుండా వేయించుకున్న టీకాలు కాస్తా ప్రాణాన్నే తీసేస్తే ఆ బాధ చెప్పనలవికాదు. కరోనా టీకా వల్లే తమ కూతుళ్లు చనిపోయారని, పరిహారం చెల్లించాలని రెండు కుటుంబాలు సుప్రీం కోర్టుకెక్కాయి. ఈ కేసులపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి. అయితే కోవిడ్ టీకాతో చనిపోతే అందుకు తాము బాధ్యులం కామని కేంద్రం ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మరణాలపై సంతాపం ప్రకటిస్తూనే తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుంది. ‘‘దేశంలో ఇప్పటివరకు 219.86 కోట్ల టీకా డోసులు ఇవ్వగా, 92,114 కేసుల్లో దుష్ప్రభావాలు కనిపించాచయి. వీటిలో 89,332 కేసులు తక్కువ ప్రభావం ఉన్నవే. 2,782 కేసుల్లో తీవ్ర దుష్ప్రభావాలు కనిపించాయి. కోవిడ్ టీకా తప్పనిసరేమీ కాదు. అవగాహన కోసం ప్రచారం చేస్తున్నామంతే’’ అని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరించింది.