Central Govt to form committee for merge of Cantonment in GHMC
mictv telugu

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కమిటీ ఏర్పాటు

January 5, 2023

దేశంలో అతి పెద్దదైనా సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ త్వరలో జీహెచ్ఎంసీలో విలీనం కానుంది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనానికి అభ్యంతరం లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో ఇప్పటికే లైన్ క్లియర్ అయ్యింది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‎లోని కంటోన్మెంట్‎ను జీహెచ్ఎంసీ విలీనం చేయటానికి విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రం 8 మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది. సివిల్ ప్రాంతం, స్థిర, చర ఆస్తులు, ఉద్యోగుల బదలాయింపు సహా అన్ని అంశాలపై కమిటీ రిపోర్టును తయారు చేసి కేంద్రానికి అందించనుంది. దీనికి సంబంధించి నివేదిక నెల రోజుల లోపులో కేంద్రానికి అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాని కేంద్రం లేఖ రాసింది. దీంతో ఈ అంశంపై కమిటీ పనులు ప్రారంభించింది. రక్షణశాఖ, తెలంగాణ మున్సిపల్ సెక్రటరీ సహా ఎనిమిది మంది సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు.

బేగంపేట విమానాశ్రయం కారణంగా, ఆర్మీ ఆంక్షలతో కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టటానికి వీల్లేకుండాపోయింది. ఎస్సీబీ వద్ద కూడా తగినన్ని నిధులు లేక.. రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేని పరిస్థితి ఉంది. దీంతో కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక ఆ ప్రాంతంలోకూడా అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి.