సరదాగా చేతిపై పచ్చబొట్టు (టాటూ) పొడిపించుకున్న ఓ యువకుడికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాకుండా పోయింది. అది మతపరమైనది కూడా కావడం వల్ల అహర్నిషలు కష్టపడి సాధించిన పారా మిలిటరీ దళాలు, జాతీయ దర్యాప్తు సంస్థ తదితర బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారు. దీంతో కోపగించుకున్న అసోం యువకుడు న్యాయం కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టులో వాదనలు జరగగా, సెల్యూట్ చేసే కుడిచేతిపై మతమపరమైన పచ్చబొట్టు ఉండడం కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధమని అధికారుల తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు.
అయితే అప్పటికే శారీరక, వైద్య, ఫిట్‌నెస్ పరీక్షలు ఉత్తీర్ణుడైన యువకుడు.. అభ్యంతరంగా ఉన్న పచ్చబొట్టును లేజర్ చికిత్స ద్వారా తొలగించుకుంటానని కోర్టు దృష్టికి తెచ్చాడు. యువకుడి వాదనను అంగీకరించిన కోర్టు టాటూ తొలగించుకోవడానికి రెండు వారాల గడువిచ్చింది. అనంతరం కొత్తగా మళ్లీ మెడికల్ బోర్డు ముందు పరీక్షలకు హాజరుకావాలని ఆదేశించింది. పరీక్షల తర్వాత అర్హుడని మెడికల్ బోర్డు నిర్ధారిస్తే.. రూల్స్ ప్రకారం యువకుడికి ఉద్యోగం ఇవ్వాలని తీర్పునిచ్చింది.