కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన..10 శాతం రిజర్వేషన్, మూడేళ్ల.. - Telugu News - Mic tv
mictv telugu

కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన..10 శాతం రిజర్వేషన్, మూడేళ్ల..

June 18, 2022

కేంద్రం ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకం విషయంలో నేడు సంచలన ప్రకటన చేసింది. ‘అగ్నిపథ్’ పథకం కింద ‘అగ్నివీర్’గా దేశానికి సేవలు అందించి, రిటైర్డ్ అయిన వారికి కేంద్ర పోలీసు బలగాల్లో 10 శాతం రిజర్వేషన్‌తోపాటు, సీఏపీఎఫ్, అస్సాం రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ట వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది. అంటే తొలిబ్యాచ్ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించినట్లు స్పష్టం చేసింది.

అగ్నివీర్ ఉద్యోగానికి 17.5-23 ఏళ్ల వరకు వయసున్న వారు అర్హులన్న విషయం తెలిసిందే. ఇలా ఎంపికై, అగ్నివీర్‌గా నాలుగేళ్లు పనిచేసి దిగిపోయిన తర్వాత త్రివిధ దళాల్లోనే రెగ్యులర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి కోసం 25 శాతం కోటాను కేంద్రం ముందే ప్రకటించింది. ఇప్పుడు దీనికి అదనంగా కేంద్ర ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్‌లు (సీఏపీఎఫ్), అస్సామ్ రైఫిల్స్‌లో ఉద్యోగాల్లో వీరికి 10 శాతం కోటాను కల్పిస్తూ, శనివారం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మరోపక్క కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం.. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో ప్రస్తుతం 78,219 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో మరో 18,124 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాత్కాలిక నియామక విధానం ‘అగ్నిపథ్’ పై దేశ్యవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మొదలైయ్యాయి. యువకుల ఆగ్రహనికి రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తోపాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. రహదారులపై, రైలు మార్గాల్లో బైఠాయించారు. ప్రభుత్వ ఆస్తులపై రాళ్ల దాడులకు పాల్పడ్డారు.