లాక్డౌన్తో ఒక్కసారిగా జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అన్నీ మూతపడటం, చేస్తున్న ఉద్యోగాలకు సెలవులు రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా మహమ్మారిని పూర్తిగా ఈ దేశం నుంచి పంపించాలంటే లాక్డౌన్ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మంగళవారం తాజాగా మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆందోళన చెందుతున్న వలస కార్మికులకు వెంటనే ఆశ్రయం కల్పించాలని సూచించింది.
వారు ఉంటున్న ఇళ్ల యజమానులు ఒకనెల అద్దె వసూలు చేయకుండా చూడాలని ఆదేశించింది. అద్దెదారుల పట్ల సానుకూలంగా ఉండేలా ఇంటి యజమానులకు సూచించాలని చెప్పింది. వలస కార్మికులు ఎక్కడికీ కదలకుండా చర్యలు చేపట్టాలని.. వారికి ఆహారం, మందులు అందించాలని, ధైర్యం కూడా అందించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.