Centre cuts Telangana's FRBM borrowing limit by Rs 19k crore
mictv telugu

తెలంగాణకు కేంద్రం షాక్.. తీసుకునే రుణాల్లో భారీ కోత

July 6, 2022

Centre cuts Telangana's FRBM borrowing limit by Rs 19k crore

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తీసుకునే అప్పుపై భారీగా కోత విధించింది. బడ్జెట్ అంచనాల ప్రకారం కేసీఆర్ సర్కార్ రూ. 53,750 కోట్లను బహిరంగ మార్కెట్ రుణాల రూపంలో రిజర్వు బ్యాంకు నుంచి తీసుకోవాలనుకున్నది. ‘కాగ్’కు సమర్పించిన ప్రొవిజినల్ డాటా ప్రకారం రూ. 52,165 కోట్లు అని పేర్కొన్నది. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో అందులో రూ. 19,000 కోట్ల మేరకు కోత పడింది. చివరకు రూ. 33 వేల కోట్లు మాత్రమే తీసుకోడానికి సూత్రప్రాయంగా లైన్ క్లియర్ అయింది. అయితే ఇందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ. 10,000 కోట్లను ప్రభుత్వం తీసుకున్నది. మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు తీసుకునే వెసులుబాటు ఉంది.

రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీవ్ర ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న బడ్జెట్ అప్పులతో పాటు, వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను కూడా ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోకి కేంద్రం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, గత రెండేళ్లలో ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి రాష్ట్రాలు చేసిన అప్పులను… ఆమేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో కోత విధించింది. మరోవైపు బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో రుణాలు మంజూరు కాకుండా రూ. 19 వేల కోట్ల మేర కోత పడడంతో దీన్ని భర్తీ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. స్వీయ ఆర్థిక వనరుల ద్వారా సమీకరించుకోవడం తప్ప కేంద్రం మీద ఆధార పడే అవకాశం లేదని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు.