చిన్నారుల తల్లిదండ్రులకు గమనిక. ఇకపై ఒకటో తరగతిలో చేరాలంటే ఇక నుంచి పిల్లలకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలి. ఈ మేరకు స్కూళ్లలో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. నూతన విద్యా విధానం ప్రకారం చిన్నారులకు మూడేళ్ల ప్రి స్కూల్ ఎడ్యుకేషన్‌తోపాటు ఒకటో తరగతి, రెండో తరగతి కలిపి ఫౌండేషనల్ స్టేజ్ ఐదేళ్లు ఉంటుంది. మూడు నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు ఈ ఐదేళ్లలో తమ వయసును బట్టి నేర్చుకుంటారు. ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ-స్కూల్ విద్య ఉంటుంది. అయితే ఒకటో తరగతిలో చేరే ముందే.. చిన్నారులకు నాణ్యమైన ప్రీస్కూల్ విద్య అందేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యా శాఖ సీనియర్ అధికారి సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వయసు నిబంధనను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణతోపాటు అసోం, గుజరాత్, పుదుచ్చేరి, లడఖ్ లాంటి రాష్ట్రాల్లో ఐదో ఏట అడుగుపెట్టిన చిన్నారులకు ఒకటో తరగతిలో అడ్మిషన్ ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో ఐదేళ్లు దాటితేనే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. బట్టీ పట్టే చదువులకు స్వస్తి చెప్పి.. సృజనాత్మకతకు పెద్ద పీట వేయడమే లక్ష్యంగా నూతన విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక, ఉన్నత విద్య తీరు తెన్నులను పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు విద్యా విధానం 10+2+3గా ఉండగా.. దాన్ని 5+3+3+4గా మార్చింది.