నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు.. కేంద్రం ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు.. కేంద్రం ప్రకటన

February 4, 2020

Nizamabad

నిజామాబాద్‌ జిల్లాలో సుగంధ ద్రవ్యాల(స్పైసెస్ బోర్డు) ప్రాంతీయ బోర్డు ఆఫీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ రోజు పార్లమెంటులో ప్రకటించారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడున్న డివిజినల్‌ స్థాయి ఆఫీస్‌ను ప్రాంతీయ స్థాయికి పెంచనున్నట్లు గోయల్ వెల్లడించారు. ఐఏఎస్ హోదా ఉన్న డైరెక్టర్ స్థాయి అధికారి ఈ ప్రాంతీయ ఆఫీస్‌లో కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు తెలపారు. ఈ ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకొనే నిజామాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పీయూష్ గోయల్ తెలిపారు. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ ఆఫీస్ ద్వారా లభిస్తాయని పేర్కొన్నారు. పసుపు నాణ్యత, దిగుబడి పెంచే విషయంపై బోర్డు పనిచేస్తుందన్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు సహకరిస్తుందని తెలిపారు. పసుపు రైతులకు అంతర్జాతీయ కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందన్నారు. నిజామాబాద్ రైతుల కోరిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను తాము కల్పించామని గోయల్ తెలిపారు. కేంద్రం తాజాగా నిజామాబాద్ జిల్లాలో ప్రకటించిన సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ప్రకటన సంక్రాంతి పండగ రోజునే ప్రకటించాల్సిందని.. కానీ, మునిసిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యం అయిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.