ఆంధ్రప్రదేశ్, తెలంగాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఉభయ తెలుగురాష్ట్రాలకు బుధవారం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాల పెరుగుదలకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్రం పేర్కొంది. అసెంబ్లీ స్థానాల పెరగాలంటే.. 2026 వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచలేమని స్పష్టం చేసింది. గత ఎనిమిదేళ్లుగా ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాలు ఆశిస్తున్నట్లు అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ఇప్పట్లో లేనట్టేనని తేల్చి చెప్పింది.
విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి.. ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. అయితే అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలంటే 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని కేంద్రం తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కిందటి ఏడాది ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రశ్నకు అడగ్గా.. ఇదే మంత్రి.. ఇదే సమాధానం ఇచ్చారు.